Sujana Chowdary: సుజనా చౌదరి కంపెనీలకు చెందిన నలుగురు డైరెక్టర్ల అరెస్ట్!
- నిన్నంతా సుజనా చౌదరి ఇళ్లలో సోదాలు
- ఆంధ్రాబ్యాంక్ కు రూ. 71 కోట్లు ఎగవేసినట్టు ఆరోపణలు
- డైరెక్టర్లను విచారిస్తున్న అధికారులు
నిన్నంతా కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సీబీఐ, ఈడీ బృందాలు నలుగురు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. సుజనా కంపెనీల్లో పని చేస్తున్న డైరెక్టర్లు జీ శ్రీనివాసరాజు, వెంకటరమణారెడ్డి, పి.సుధాకర్ రెడ్డి, వెంకటకల్యాణ్ రాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి దాడుల్లో పలు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు, కర్ణాటకలో 'బెస్ట్ అండ్ కాంప్టన్' పేరిట సుజనా నిర్వహించే వ్యాపారం గురించి వివరాలు సేకరించారు.
తప్పుడు ఇన్ వాయిస్ లను క్రియేట్ చేసి ఈ సంస్థ బ్యాంక్ నుంచి రుణాలు పొందినట్లు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే సంస్థపై మనీలాండరింగ్ కేసును కూడా సీబీఐ నమోదు చేసింది. ఆపై ఇదే కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ కేసులో ఆంధ్రాబ్యాంక్ నుంచి తీసుకున్న రూ. 71 కోట్లను ఎగవేసినట్లు సుజనాచౌదరిపై ఆరోపణలున్నాయి. కాగా, తాము అదుపులోకి తీసుకున్న డైరెక్టర్లను ప్రస్తుతం విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.