irrigation projects: డెల్టా రైతుల జీవితాలతో ఆడుకున్న తెలుగుదేశం ప్రభుత్వం: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ఫైర్
- నిబంధనలు పాటించకుండా ఎత్తిపోతల పథకాలు
- కమీషన్లకు కక్కుర్తిపడి పనులు
- నదుల అనుసంధానానికి ఎటువంటి అనుమతుల్లేవు
నదుల అనుసంధానం, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు పాటించకుండా పనులు చేపట్టి డెల్టా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుకుందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వట్టి వసంతకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం కమీషన్లకు కక్కుర్తిపడి ఇష్టానుసారం పనులు చేపట్టారని ఆరోపించారు. గోదావరి నదిపై ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకాలను తాత్కాలికంగా నిలిపి వేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించి తాను దాఖలు చేసిన పిటిషన్‌పైనే ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. డెల్టా ప్రాంత రైతుగా జరుగుతున్న అన్యాయాన్ని తల్చుకుని తాను కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ విషయమై 2015 నుంచి కోర్టులో పోరాడుతున్నామని తెలిపారు.