Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి టీడీపీ నేత జలీల్ ఖాన్ రాజీనామా!

  • ఏపీలో కులరాజకీయాలు బాగా నడిచాయి
  • ప్రజలు ఇచ్చిన తీర్పును మేం గౌరవిస్తున్నాం
  • విజయవాడలో మీడియాతో టీడీపీ నేత

టీడీపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీమానా చేశారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తొలగించకముందే ఆయన గౌరవంగా తప్పుకున్నారు.

కాగా, వక్ఫ్ బోర్డు బాధ్యతల నుంచి తప్పుకోకుంటే బలవంతంగా తప్పించాల్సి వస్తుందన్న సమాచారం రావడంతోనే జలీల్ ఖాన్ తన పదవికి  రాజీనామా చేసినట్లు సమాచారం. రాజీనామా చేసిన అనంతరం విజయవాడలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో అద్భుతమైన అభివృద్ధి పనులు చేబట్టిందని జలీల్ ఖాన్ తెలిపారు. విజయవాడ పశ్చిమలోనే 1600 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.21 కోట్లు అందించానని చెప్పారు. కొండ ప్రాంతంలో ఇళ్ల పట్టాలను క్రమబద్ధీకరణ చేయించామని వెల్లడించారు. నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలు అంటూ లేకుండా చేశామని పేర్కొన్నారు.

ప్రజలు ఇచ్చిన తీర్పును తాము గౌరవిస్తున్నామని చెప్పారు. ఈసారి కుల రాజకీయాలు ఎక్కువగా నడిచాయని అభిప్రాయపడ్డారు. 2014లో వైసీపీ టికెట్ పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన జలీల్ ఖాన్.. ఓ టీవీ ఇంటర్వ్యూలో బీకాం గ్రూపులో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు.

  • Loading...

More Telugu News