mumbai: ఇడ్లీ చట్నీ తయారీకి మరుగుదొడ్డి నీరు వినియోగం... వీడియో చూసి నోరెళ్లబెడుతున్న వీక్షకులు

  • నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్న వీడియో
  • బయట టిఫిన్‌ తయారీలో నాణ్యతపై గొల్లు మంటున్న జనం
  • ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్న నిపుణులు

వీధుల్లోని టిఫిన్ సెంటర్ల  వద్ద దొరికే అల్పాహారం తయారీలో ఎటువంటివి వాడుతారో, అవి తిన్న వారి ఆరోగ్యానికి ఎంతటి ప్రమాదమో తెలిపే వీడియో ఇది. ఓ ఇడ్లీ వ్యాపారి చట్నీ తయారీకి ఏకంగా మరుగు దొడ్డిలో నీటిని వినియోగిస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్‌ చేయడమే కాదు, బయట టిఫిన్‌ చేసే వారిని ఆలోచనలో పడేస్తోంది.

వివరాల్లోకి వెళితే...ముంబయిలోని బొరివెలి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ వ్యక్తి అల్పాహారం వ్యాపారం నిర్వహిస్తుంటాడు. ఇటీవల ఓ రోజు సదరు వ్యాపారి రైల్వేస్టేషన్‌లోని మరుగుదొడ్డికి వెళ్లి అక్కడి నీటిని తెచ్చి చట్నీ తయారు చేశాడు. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది.

ఈ వీడియో చూసిన ఆహార భద్రతా అధికారులు (ఎఫ్‌డీఏ) దర్యాప్తునకు ఆదేశించారు. ఈ నీరు వినియోగం ఆరోగ్యానికి మంచిది కాదని, కలుషిత నీటిని వినియోగించి జనం ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఇటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీడియో ఆధారంగా సదరు వ్యక్తిని పట్టుకుని అతని లైసెన్స్‌ పరిశీలిస్తామని, అవసరమైతే లైసెన్స్‌ క్యాన్సిల్‌ చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, ఈ వీడియో ఎప్పుడు తీశారన్నది తెలియదు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News