modi: ఏమైనా చేయవచ్చని మోదీ అనుకుంటే కుదరదు.. ముస్లింలు భయపడాల్సిన అవసరం లేదు: ఒవైసీ

  • ఈ దేశంలో మనం కిరాయిదారులం కాదు
  • అందరితో సమానంగా బతికే హక్కు మనకు ఉంది
  • ఇస్లాంలో హింసకు తావు లేదు

బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చిందని ముస్లింలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... దేశంలోని ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. దేవాలయాలను ప్రధాని మోదీ సందర్శిస్తే... మనం మసీదులను సందర్శిద్దామని చెప్పారు. మోదీ గుహల్లో కూర్చుంటే... మేము మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటామని గర్వంగా చెబుదామని అన్నారు. భారత్ లో ఊపిరితో ఉన్న ఒక గొప్ప రాజ్యాంగ వ్యవస్థ ఉందని చెప్పారు. మన దేశంలో 300లకు పైగా సీట్లను సాధించడం గొప్ప విషయమేమీ కాదని... 300 సీట్లు సాధించిన బీజేపీ మన హక్కులను కాలరాయలేదని అన్నారు.

మనం మన మతాన్ని ఆచరించే స్వేచ్ఛను భారతీయ చట్టాలు, రాజ్యాంగం ఇచ్చాయని ఒవైసీ తెలిపారు. భారత్ లో మనం కిరాయిదారులం కాదని... అందరితో సమానంగా, గౌరవంగా బతికే హక్కు మనకు ఉందని చెప్పారు. భారత్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని... మనమంతా మన దేశాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు కృషి చేద్దామని తెలిపారు. మన దేశం గొప్పగా పరిఢవిల్లేలా చేద్దామని ముస్లింలకు పిలుపునిచ్చారు.

300లకు పైగా సీట్లను గెలుచుకున్నాం, ఏదైనా చేయవచ్చని ప్రధాని మోదీ అనుకుంటే... జరిగే పని కాదని ఒవైసీ అన్నారు. భారత్ కోసం పోరాడుతానని అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేస్తున్నాడని చెప్పారు. శ్రీలంకలో చోటుచేసుకున్న ఉగ్రదాడులపై స్పందిస్తూ... ఇస్లాంలో హింసకు తావు లేదని తెలిపారు. ప్రార్థనా స్థలాల్లో, ఇతర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడి, 40 మంది అమాయక చిన్నారులతో సహా 200 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఇస్లాం గురించి మీరు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. హంతకులు ఇస్లాంను కాకుండా సైతాను బోధనలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News