Ambica krishna: ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన టీడీపీ నేత అంబికా కృష్ణ
- 13 నెలలపాటు ఎఫ్‌డీసీ చైర్మన్‌గా కొనసాగిన అంబికా కృష్ణ
- తెలుగు చిత్ర పరిశ్రమ అభిృద్ధికి కృషి చేశానన్న నేత
- టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ సినిమా, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డీసీ) చైర్మన్ అంబికా కృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 13 నెలులుగా ఎఫ్‌డీసీ చైర్మన్ గా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని అంబికా భవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. నిజానికి తన పదవీకాలం సెప్టెంబరు వరకు ఉందని, అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పదవికి రాజీనామా చేసినట్టు తెలిపారు.
ఈ 13 నెలల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసినట్టు చెప్పారు. ఏపీలో షూటింగులు జరిగితే ఉపాధి లభిస్తుందన్న ఉద్దేశంతో రూ.4 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలకు ట్యాక్స్‌లు ఎత్తివేస్తూ జీవో తెచ్చినట్టు చెప్పారు. ఫలితంగా 30 సినిమాలు ఏపీలో షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలిపారు. తాను రాజీనామా చేసింది పదవికే తప్ప పార్టీకి కాదని తేల్చి చెప్పారు. టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.