Kamareddy District: బర్రె మరణిస్తే... బయటకు వచ్చిన అధికారుల అవినీతి!
- కామారెడ్డి జిల్లాలో ఘటన
- ఒక్కో రైతుకు రెండు గేదెలు ఇచ్చిన అధికారులు
- గేదెలకు బీమా చేయించకుండానే చేసినట్టు డబ్బు వసూలు
- విచారణ జరిపిస్తున్నామన్న ఉన్నతాధికారులు
ఓ రైతుకు ఇచ్చిన బర్రె మరణించగా, బీమా నిమిత్తం వచ్చే డబ్బులను తీసుకునేందుకు ఆ రైతు వెళ్లిన వేళ, పీఎంఎస్కేవై పథకంలో అధికారుల అవినీతి బయటపడింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకంలో భాగంగా కామారెడ్డి జిల్లా పెద్దగుల్లా గ్రామానికి చెందిన 22 మంది రైతులకు ఒక్కొక్కటి రూ. 80 వేల చొప్పున రెండేసి గేదెలను ఇచ్చారు. గేదెలపై 50 శాతం రాయితీ ఉండటంతో రైతులు గేదెకు రూ. 40 వేల చొప్పున చెల్లించారు. దీనిపై అదనంగా గేదెకు బీమా చేయించాలని, అది చనిపోతే డబ్బులు వస్తాయని చెప్పి గేదెకు రూ. 6 వేల చొప్పున వసూలు చేశారు. అయితే, ఒక గేదెకే బీమా చేయించి, రెండో గేదెకు చేయించకుండా ఆ డబ్బును అధికారులు కాజేశారు.
ఇటీవల పెద్దగుల్లా గ్రామానికే చెందిన రైతు వెంకట్ కు ఇచ్చిన గేదె మరణించగా, బీమా సొమ్ము కోసం బాన్సువాడలోని కార్యాలయానికి వెళ్లిన వేళ అసలు విషయం బయటపడింది. మృతి చెందిన గేదెకు బీమా లేదని చెప్పడంతో వెంకట్ అవాక్కయ్యాడు. విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో విచారిస్తున్నామని, అవినీతికి పాల్పడినట్టు తేలితే అధికారులపై చర్యలుంటాయని హామీ వారు ఇచ్చారు.