Amar: అంబరీశ్ కుమారుడి తొలి సినిమా టికెట్ ను లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన నిర్మాత
- కొడుకును సర్ ప్రైజ్ చేయడం కోసం ఖర్చుకు వెనుకాడని వైనం
- 'అమర్' చిత్రానికి కన్నడనాట విపరీతమైన క్రేజ్
- గురువారం విడుదలవుతున్న చిత్రం
ప్రముఖ నటుడు అంబరీశ్ తన కుమారుడు అభిషేక్ నటించిన మొదటి చిత్రాన్ని చూడకముందే ఈ లోకం నుంచి నిష్క్రమించడం బాధాకరమైన విషయం. అంబరీశ్, సుమలత దంపతుల కుమారుడు అభిషేక్ నటించిన 'అమర్' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, సందేశ్ ప్రొడక్షన్స్ అధినేత మంజునాథ్ 'అమర్' సినిమా టికెట్ల కోసం ఏకంగా లక్ష రూపాయలు వెచ్చించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తొలి రోజు, తొలి ఆటకు సంబంధించి రెండు టికెట్లను ఆయన లక్ష రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. ఇదంతా అంబరీశ్ కొడుకును ఆశ్చర్యంలో ముంచెత్తడానికేనట!
అంబరీశ్ వారసుడిగా కన్నడ సినీ ఎంట్రీ ఇస్తున్న అభిషేక్ కు మొదటి సినిమా రిలీజ్ కాకముందే భారీ క్రేజ్ ఏర్పడింది. కన్నడ స్టార్ హీరోలు దర్శన్, యశ్ ల అండదండలు పుష్కలంగా ఉండడంతో పాటు, తండ్రి ఫ్యాన్స్ మొత్తం అభిషేక్ వెంట నిలిచారు. దాంతో 'అమర్' చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. కాగా, అంబరీశ్ కన్నుమూసే సమయానికి ఈ చిత్రం రషెస్ వచ్చినా, ఆయన కనీసం కూర్చోలేని పరిస్థితిలో ఉండడంతో సినిమా చూపించలేకపోయారు. ఈ చిత్రంలో అంబరీశ్ కూడా నటించారు.
ఇటీవల అంబరీశ్ మరణించగా, ఆయన అర్ధాంగి సుమలత మాండ్య నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీచేసి ఎంపీగా ఘనవిజయం సాధించడం విశేషం అని చెప్పాలి. ఇప్పుడు తన కుమారుడు అభిషేక్ కూడా హీరోగా మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకోవాలని, తండ్రి పేరు నిలబెట్టాలని సుమలత ఆశిస్తున్నారు.