Andhra Pradesh: ఇన్ చార్జీల వ్యవస్థ వల్లే టీడీపీ ఓడిపోయింది.. సొంత క్యాడర్ దూరమైంది!: చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం
- ఈ వ్యవస్థ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపింది
- ఓటేసిన ప్రజల కోసం మేం పోరాడాలి
- మీడియాతో మాట్లాడిన బలరాం, చినరాజప్ప
చంద్రబాబు నివాసంలో ఈరోజు టీడీపీ శానససభాపక్ష సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబును టీడీపీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ విషయమై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ.. పార్టీలో ఉపనేతలు, విప్ పదవులను ఎవరికి ఇవ్వాలన్న విషయమై తుది నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలిపెట్టామని తెలిపారు. అసెంబ్లీలో తమకు 23 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నప్పటికీ ప్రజల తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. టీడీపీ ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేసుకుంటామన్నారు.
మరోవైపు చీరాల ఎమ్మెల్యే, టీడీపీ నేత కరణం బలరాం స్పందిస్తూ.. ఇన్ చార్జీల వ్యవస్థ కారణంగానే టీడీపీ ఓడిపోయిందని ఆరోపించారు. ఈ ఇన్ చార్జీల వ్యవస్థ కారణంగా పార్టీకీ, టీడీపీ శ్రేణులకు మధ్య అంతరం పెరిగిందని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పార్టీ కేడర్ పై ఇన్ చార్జీల వ్యవస్థ ప్రతికూల ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డారు. తమకు ఓటేసిన ప్రజల కోసం పోరాడాల్సిన బాధ్యత తమపై ఉందని బలరాం అన్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.