Andhra Pradesh: టీడీపీ పరిస్థితిపై ముందుగానే హెచ్చరించా.. ఎవ్వరూ పట్టించుకోలేదు!: గోరంట్ల బుచ్చయ్యచౌదరి
- ఏపీలో ఎన్నడూలేనంతగా కులాల ప్రస్తావన వచ్చింది
- టీడీపీ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలి
- అమరావతిలో మీడియాతో టీడీపీ సీనియర్ నేత
టీడీపీ అధినేత చంద్రబాబు సీఎల్పీ నేతగా ఉంటేనే బాగుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకు పరిమితం కావడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని వ్యాఖ్యానించారు. గుంటూరులోని ఉండవల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టెక్నాలజీ తమ కొంప ముంచిందా? లేక నేల విడిచి సాము చేశామా? అన్నది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఏపీలో పార్టీ పరిస్థితిపై తాను గతంలోనే ఆందోళన వ్యక్తం చేశానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. అయితే తన ఆందోళనను ఎవ్వరూ పట్టించుకోలేదని వాపోయారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో ఈసారి కులాల ప్రస్తావన వచ్చిందని బుచ్చయ్యచౌదరి గుర్తుచేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారానికి వెళ్లాలా? వద్దా? అన్నది త్వరలోనే నిర్ణయించుకుంటామన్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ నేతను ఇంటికి వచ్చి ఆహ్వానించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.