Adilabad: ఆదిలాబాద్ ఎంపీ సీటు గెలుస్తామని బీజేపీ కూడా ఊహించి ఉండదు: కేటీఆర్
- కార్యకర్తలు లేని చోట్ల కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి
- రాష్ట్ర సమస్యల విషయంలో బీజేపీతో రాజీపడేది లేదు
- హరీశ్ ను పక్కన పెట్టామన్న విషయం వాస్తవం కాదు
ఇటీవల తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ (ఎస్టీ) ఎంపీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. టీఆర్ఎస్ అభ్యర్థి గోడెం నగేశ్ పై 58,493 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు విజయం సాధించారు. ఈ ఊహించని ఘటనపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆదిలాబాద్ నుంచి గెలుస్తామని బీజేపీ కూడా ఊహించి ఉండదని వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలు లేని చోట్ల కూడా ఆ పార్టీకి ఓట్లు పడ్డాయని సెటైర్లు విసిరారు. ప్రధానిగా మోదీ అభ్యర్థిత్వమే ఆ పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టిందని అన్నారు. ఒకవేళ తెలంగాణలో తాము అన్ని ఎంపీ స్థానాలనూ గెలిచినా కేంద్రంలో ఏమీ చేయలేని పరిస్థితి అని, ఎందుకంటే, మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ మెజార్టీ స్థానాలు సాధించిందని అన్నారు. రాష్ట్ర సమస్యల విషయంలో బీజేపీతో రాజీపడేది లేదని, ఈ ఎన్నికల్లో హరీశ్ రావును పక్కన పెట్టామన్న విషయం వాస్తవం కాదని స్పష్టం చేశారు.