NTR: కనీస అలంకరణ లేక బోసిపోయిన ఎన్టీఆర్ ఘాట్... లక్ష్మీపార్వతి కంటతడి!
- నేడు ఎన్టీఆర్ జయంతి అయినా కనిపించని పుష్పాలంకరణ
- ఘాట్ వద్ద మరమ్మతులు కూడా చేపట్టని స్థానిక నేతలు
- అసహనాన్ని వ్యక్తం చేసిన జూనియర్ ఎన్టీఆర్
నేడు ఎన్టీఆర్ జయంతి కాగా, హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కనీస అలంకరణలేక బోసిపోయింది. ప్రతి సంవత్సరమూ ఎన్టీఆర్ జయంతి నాటికి ఘాట్ ను ఎంతో అందంగా అలంకరిస్తారన్న సంగతి తెలిసిందే. పలురకాల పూలు తెచ్చి, ఎన్టీఆర్ స్మారకాన్ని తీర్చిదిద్దుతారు. ఈ సంవత్సరం మాత్రం ఘాట్ ను అలాగే వదిలేశారు. కనీసం పెచ్చులూడిన భాగాలకు మరమ్మతులు కూడా చేయలేదు. ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, తన తాతయ్య సమాధిని అలా చూసి, ఒకింత అసహనానికి గురయ్యారు.
ఆపై ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి తన భర్తకు నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి, ఘాట్ వద్ద ఏర్పాట్లపై మండిపడ్డారు. ఎంతో పవిత్రంగా చూడాల్సిన ప్రదేశాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు ఇలా గాలికి వదిలేశారని, కనీస అలంకరణ కూడా లేకపోయిందని కంటతడి పెట్టారు. ఎన్టీఆర్ జయంతిని సూచిస్తూ, ఒక్క బ్యానర్ కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రలకు తగిన శాస్తి జరిగిందని, ప్రజలే ఆయనకు బుద్ధి చెప్పారని మండిపడ్డారు. తాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం కాదని, చంద్రబాబు అనే పేరున్న వ్యక్తికి మాత్రమే వ్యతిరేకమని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు.