Guntur: గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాలపై హైకోర్టును ఆశ్రయించనున్న వైసీపీ
- అధికారుల కారణంగా టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి
- జగన్ వద్ద మొర పెట్టుకున్న నేతలు
- రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని ఆరోపణ
గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాలు తమ ఖాతాలో చేరాల్సినవని, ఎన్నికల అధికారుల తప్పిదం కారణంగా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయని ఆయా స్థానాలకు పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థులు అధినేత జగన్ వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో ఆయా లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని వైసీపీ భావిస్తోంది. నేడు గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాల అభ్యర్థులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి తదితరులు భేటీ అయ్యారు.
గుంటూరు పోస్టల్ బ్యాలెట్ల అంశంపై అక్కడి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మోదుగుల ఆరోపిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్లు, సర్వీస్ ఓట్ల సంఖ్య దాదాపు 9 వేలకు పైనే ఉందని, వాటిని లెక్కించలేదని, వాటిని లెక్కిస్తే తన విజయం ఖాయమై ఉండేదని మోదుగుల జగన్ వద్ద ప్రస్తావించినట్టు సమాచారం. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని వైసీపీ నిర్ణయించింది.