Gautam Sawang: ఏపీ నూతన డీజీపీగా గౌతమ్ సవాంగ్ కు అవకాశం?

  • అనేక స్థాయుల్లో అనుభవం ఉన్న సవాంగ్
  • సవాంగ్ 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి
  • మదనపల్లె ఏఎస్పీగా ప్రస్థానం ఆరంభం

ఏపీ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైసీపీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మరికొన్నిరోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. ఈ క్రమంలో కీలకస్థాయుల్లోకి కొత్త అధికారులు రానున్నారు. ఇప్పటివరకు డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ స్థానంలో 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ నూతన డీజీపీగా నియమితులయ్యే అవకాశం వుందని వార్తలొస్తున్నాయి. జగన్ ఏరికోరి సవాంగ్ ను పోలీస్ బాస్ గా తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ సవాంగ్ ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

సవాంగ్ చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన పోలీస్ కెరీర్ ప్రారంభించారు. ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు, వరంగల్ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. 2001 నుంచి 2003 మధ్య వరంగల్ రేంజ్ డీఐజీగానూ వ్యవహరించారు. ఈ బాధ్యతలు చేపట్టకముందు హోంగార్డు విభాగం డీఐజీగా సేవలు అందించారు. 2003 నుంచి 2005 వరకు ఎస్ఐబీ, ఏపీఎస్పీ విభాగాల్లోనూ డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్లారు.

తిరిగి 2015లో రాష్ట్రానికి తిరిగొచ్చిన గౌతమ్ సవాంగ్ విజయవాడ పోలీస్ కమిషనర్ గా తనదైన ముద్రవేశారు. 2018 వరకు ఆయన బెజవాడ సీపీగా వ్యవహరించి సంఘ వ్యతిరేక శక్తులను అణచివేయడంలో కీలకపాత్ర పోషించారు.

  • Loading...

More Telugu News