ADR: 55 శాతం ఏపీ ఎమ్మెల్యేలది నేర చరిత్రే: ఏడీఆర్ నివేదిక
- వైసీపీలోనే నేరచరితులు అధికం
- జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక్కడిపైనా అభియోగాలు
- వెల్లడించిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్
ఏపీకి నూతనంగా ఎన్నికైన 175 మంది ఎమ్మెల్యేల్లో 174 మంది నామినేషన్ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్ (అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) మొత్తం ఎమ్మెల్యేల్లో సగం మందికి పైగా ఎమ్మెల్యేలకు నేర చరిత్ర ఉందని పేర్కొంది. వీరిలో 55 మందిపై అంటే 32 శాతం ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని వెల్లడించారు.
పార్టీల పరంగా పరిశీలిస్తే, వైసీపీకి చెందిన 150 మంది అఫిడవిట్లు పరిశీలించామని, అందులో 57 శాతంగా 86 మందిపై నేరారోపణలు ఉన్నాయని, టీడీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేల్లో 9 మందిపై (39 శాతం), జనసేనకు చెందిన ఏకైక ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. వీరిలో 50 మంది వైసీపీ, నలుగురు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని తమ విశ్లేషణలో వెల్లడైనట్టు తెలిపింది.
ఆరుగురు ఎమ్మెల్యేలపై మహిళా వేధింపుల కేసులున్నాయని, వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్య కేసుందని, మరో పది మంది ఎమ్మెల్యేలపై హత్యాయత్నం అభియోగాలు నమోదు ఉన్నాయని వెల్లడించింది. ఏడుగురిపై కిడ్నాప్ కేసులు విచారణ దశలో ఉండగా, 8 మందిపై నేరారోపణలు నిరూపితం అయ్యాయని ఏడీఆర్ తెలిపింది.