Andhra Pradesh: మంగళగిరి నా ఇల్లు.. మీరంతా నా కుటుంబం అని ఊరికే చెప్పలేదు!: నారా లోకేశ్
- మీకోసం నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి
- టీడీపీ శ్రేణులకు ధైర్యం చెప్పిన లోకేశ్
- తాను అండగా ఉన్నానని హామీ
తెలుగుదేశం నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ను ఈరోజు మంగళగిరి నుంచి వచ్చిన పలువురు టీడీపీ నేతలు, కార్యకర్తలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ.. ప్రజా తీర్పును గౌరవిద్దామనీ, పార్టీ బలోపేతానికి కలిసి పనిచేస్తామని టీడీపీ శ్రేణులకు సూచించారు. ‘ఎన్నికలు ఐదేళ్లకు ఒకసారి జరిగేవి, వాటివల్ల అధికార మార్పిడి జరగొచ్చు కానీ మీతో నా అనుబంధాన్ని మార్చలేవు. మంగళగిరి నియోజకవర్గం నా ఇల్లు మీరంతా నా కుటుంబం అని ప్రచారంలో చెప్పింది వట్టి మాటలు కాదు. గడప గడపకు వచ్చాను, గెలిచినా ఓడినా మీతోనే ఉంటాను అని చెప్పా.
ప్రజలు ఎవరికి ఓటువేసినా సరే నా మాట మాత్రం మారదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు నా కుటుంబ సభ్యులు. మీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కష్టం నష్టం, సంతోషం సంబరం ఏదైనా సరే మీతోనే నా ప్రయాణం. నేను మీలో ఒకడిని మీవాడిని. ఓటమికి కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు. ఫలితాలపై విశ్లేషణ తరువాత భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. మనకి పార్టీ అండగా ఉంది. ఇకపై మరింత బాధ్యతతో పనిచేసి ప్రజలకు చేరువ అవ్వాలి. ఎన్నికలలో మీరు నాకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.