GMS: మోదీ ప్లాన్... ఈదఫా మరింత పక్కాగా గోల్డ్ మానిటైజేషన్ ప్లాన్!
- ఇండియాలో 30 వేల టన్నులకు పైగా బంగారం
- జీఎంఎస్ లో బ్యాంకులకు వచ్చింది 18 టన్నులే
- మరింత సరళంగా నిబంధనలు మార్చే యోచన
- బడ్జెట్ సెషన్ లో రానున్న కొత్త బిల్లు
నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చింది. తొలి విడతలోనే పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, బంగారం విధానంలో సంస్కరణలు తెచ్చిన మోదీ సర్కారు, ఈ దఫా మరిన్ని సంస్కరణలు తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా, గతంలో ప్రవేశపెట్టిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్)ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని మోదీ కృతనిశ్చయంతో ఉన్నారని తెలుస్తోంది.
ఇండియాలో బంగారాన్ని ఆస్తిగా భావిస్తారన్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే గృహావసరాల నిమిత్తం బంగారాన్ని అత్యధికంగా వాడుతున్నది ఇండియాలోనే. భారత గృహిణుల వద్ద సుమారు 25 వేల టన్నులకు పైగా బంగారం ఉంది. ఇక దేవాలయాల్లో 3,500 నుంచి 4,000 టన్నుల వరకూ బంగారం ఉందని అంచనా. గత సంవత్సరం జీఎంఎస్ స్కీమ్ కింద 18 టన్నుల బంగారం బ్యాంకులకు వచ్చింది. 26 టన్నుల విలువైన బంగారం బాండ్లను ప్రభుత్వం విక్రయించింది. 749 టన్నుల బంగారం దేశంలోకి దిగుమతి అయింది. వినియోగంలో ఉన్న బంగారంతో పోలిస్తే, జీఎంఎస్ కు వచ్చిన స్పందన అత్యంత నామమాత్రమే.
దీన్ని దృష్టిలో పెట్టుకుని, పార్లమెంట్ బడ్జెట్ సెషన్ కు ముందే గోల్డ్ బోర్డ్ ను సమావేశపరిచి, ప్రీసియస్ మెటల్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా చట్టం 2019కి ఆమోదం తెలపాలన్నది మోదీ ఆలోచనగా తెలుస్తోంది. తొలుత క్యాబినెట్ ఆమోదం తీసుకుని ఆపై బిల్లును పార్లమెంట్ ముందుకు తేవాలని భావిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఫార్వార్డ్ మార్కెట్స్ కమిషన్, సెబీ పనిచేస్తున్న తరహాలోనే విలువైన లోహాల బోర్డు కూడా పని చేస్తుందని, 5 గ్రాముల స్వల్ప బంగారాన్ని కూడా ట్రేడింగ్ చేసుకునేలా నూతన నిబంధనలుంటాయని తెలిపాయి.
ఇక ఇదే సమయంలో బంగారం డెలివరీ నిబంధనలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనలకు అనుగుణంగా రూపొందిస్తారని అధికారులు తెలిపారు. బ్యాంకుల్లో గోల్డ్ మెటల్ ఖాతాలను తెరిచేందుకు వీలు కల్పిస్తామని అన్నారు. ప్రస్తుతం బ్యాంకులు గోల్డ్ ఖాతాలను సైతం రూపాయిల్లోనే నిర్వహిస్తున్నాయి. ఉదాహరణకు, ప్రస్తుత నిబంధనల ప్రకారం, బ్యాంకుల్లో బంగారాన్ని డిపాజిట్ చేస్తే, మెచ్యూరిటీ అనంతరం రూపాయల్లో మాత్రమే డబ్బు లభిస్తుంది. ఈ కారణం చేతనే జీఎంఎస్ కు ప్రజల నుంచి స్పందన రాలేదని అంచనా వేసిన కేంద్రం, కొత్త నిబంధనల తరువాత ఈ స్కీమ్ కు మెరుగైన స్పందన వస్తుందని అంచనా వేస్తోంది.