KApaul: పాల్ వన్నీ ప్రగల్బాలే...ఎక్కడా భారీగా ఓట్లు పడింది లేదు
- సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర పరాభవం
- నాలుగైదు మినహా అన్ని చోట్లా 300 లోపే ఓట్లు
- అధికారం నాదే అంటూ హడావుడి చేసిన మతబోధకుడు
చంద్రబాబును మట్టికరిపిస్తా...జగన్ నాకు పోటీయే కాదు...పవన్ కల్యాణ్ నాతో చేతులు కలిపితే చరిత్ర సృష్టిస్తాం...సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్ పలికిన ప్రగల్బాలు ఇవీ. ఒక ఎజెండా లేదు. సరైన అభ్యర్థి లేడు. ఎక్కడా పద్ధతిగా ప్రచారం చేసిందీ లేదు. చివరికి పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువైన పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు నావే అంటూ బీరాలు పలికిన పాల్ ప్రజాశాంతి పార్టీకి ఎక్కడా గణనీయంగా ఓట్లు రాలలేదు. స్వయంగా ఆయన పోటీ చేసిన స్థానంలోనే 300 ఓట్లు దాటలేదు. 22 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలిన పేర్లతో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించారు.
ఆయన పార్టీ గుర్తు కూడా హెలికాప్టర్ కావడంతో ఫ్యాన్‌ను పోలి ఉందని వైసీపీ ఆందోళన చెందింది. కండువా కూడా ఇంచుమించుగా అలాగే ఉండడంతో కుట్రలో భాగమంటూ విమర్శలు కురిపించింది. గుర్తు మార్చాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేసింది. ఇన్ని చేసినా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు దక్కిన ఓట్లు అంతంతే. అత్యధికంగా ఆలూరులో 1327 ఓట్లు రాగా, పలమనేరులో 1107, ఒంగోలులో 400, పెనమలూరులో 300 ఓట్లు వచ్చాయి. జమ్మలమడుగులో అత్యల్పంగా 119 ఓట్లే పడ్డాయి. మిగిలిన నియోజకవర్గాల్లో ఎక్కడా 300కు మించి ఓట్లు రాలేదు సరికదా కనీసం డిపాజిట్లు దక్కలేదు.