Team India: పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. భారత్‌తో మ్యాచ్ తర్వాతే భార్య, పిల్లలకు అనుమతి!
- ఆటగాళ్ల అభ్యర్థనను తోచిపుచ్చిన పీసీబీ
- భారత్‌తో వచ్చే నెల 16న మ్యాచ్
- ఆ తర్వాతి రోజు నుంచే కుటుంబ సభ్యులకు అనుమతి
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్‌లో భారత్‌తో జరగనున్న మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల కుటుంబ సభ్యులను అనుమతించాలని నిర్ణయించింది. భారత్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాతి రోజు నుంచి కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఆటగాళ్లకు అనుమతి ఇస్తామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పేర్కొంది. ఇంగ్లండ్ పర్యటనలో భార్య, పిల్లలను అనుమతించాలంటూ ఆటగాళ్లు బోర్డుకు మొరపెట్టుకున్నారు. అయితే, అది కుదరదని తేల్చేసిన పీసీబీ భారత్‌తో మ్యాచ్ ముగిసే వరకు అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దని తెగేసి చెప్పింది. ఇతర జట్లు కూడా ఇంచుమించు ఇటువంటి నిర్ణయాన్నే తీసుకోవడంతో పాక్ బోర్డు కూడా దానిని అనుసరించినట్టు తెలుస్తోంది.
కాగా, జూన్ 16న చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు పాకిస్థాన్‌పై ఓటమి ఎరుగని భారత్ ఆ రికార్డును పదిలపరుచుకోవాలని భావిస్తుండగా, ఈసారి గెలిచి టీమిండియాకు కళ్లెం వేయాలని పాక్ గట్టి పట్టుదలగా ఉంది.