Jagan: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్
- 14వ శాసనసభ రద్దు
- నేడు 15వ శాసనసభకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ
- గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్‌కు అందించనున్న ద్వివేది
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన శాసనసభ ఎన్నికల ఫలితాలు రావడంతో 14వ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఫలితాల అనంతరం మంత్రివర్గం చేసిన తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్ ఆ వెంటనే అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. త్వరలో ఏర్పడబోయే 15వ శాసనసభకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ నేడు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల జాబితాను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది నేడు గవర్నర్‌ను కలిసి అందించనున్నారు.
శనివారం హైదరాబాద్ చేరుకున్న వైసీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అంతకుముందు గవర్నర్ నరసింహన్‌తో రాజభవన్‌లో సమావేశమయ్యారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా వైసీపీ నేతలు గవర్నర్‌ను కలిసి కోరారు.