Jagan: త్వరలోనే అధికారులతో కలిసి సమావేశమవుదాం: జగన్ తో కేసీఆర్
- ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళదాం
- గోదావరి నీటితో రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది
- రెండు రాష్ట్రాలకు మేలు కలిగేలా వ్యవహరిద్దాం
ఏపీ కాబోయే సీఎం జగన్ ఇవాళ సతీసమేతంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఘనస్వాగతం పలకడమే కాకుండా శాలువాతో జగన్ ను సత్కరించి, కానుకలు అందజేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ తో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నామన్న కేసీఆర్, ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళదామని జగన్ కు సూచించారు.
గోదావరి నుంచి ప్రతి సంవత్సరం మూడున్నర వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని, తెలంగాణ 800 టీఎంసీలు నీరు వినియోగించుకుంటుందని, మిగతా నీరంతా ఏపీ వాడుకోవచ్చని అన్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి సోమశిలకు గ్రావిటీ ద్వారా నీళ్లను పంపించే వెసులుబాటు ఉందని, తద్వారా రాయలసీమలో జలకళ చూడొచ్చని కేసీఆర్ జగన్ కు వివరించారు. త్వరలోనే రెండు రాష్ట్రాల అధికారులతో కలిసి దీనిపై చర్చించుకుందామని కేసీఆర్ ఈ సందర్భంగా జగన్ కు ప్రతిపాదించారు. దీనికి జగన్ కూడా సానుకూలంగా స్పందించారు.