Congress: ఘోర పరాజయంతో కాంగ్రెస్‌లో జోరందుకున్న రాజీనామాలు
- ఉత్తరప్రదేశ్, ఒడిశా పీసీసీ చీఫ్‌ల రాజీనామా
- ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా
- రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు దక్కింది ఒక్కో సీట్ మాత్రమే
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలవడంతో ఆ పార్టీ నేతలు రాజీనామాల బాట పట్టారు. ఆయా రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు తమ పదవులను త్యజిస్తున్నారు. ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్‌బబ్బర్, ఒడిశా పీసీసీ చీఫ్ నిరంజన్ పట్నాయక్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. దీంతో తీవ్ర నిరాశకు గురైన రాజ్ బబ్బర్ కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ చీఫ్‌కు రాజీనామా లేఖ పంపారు.
ఎన్నికల ఫలితాలు తనను ఎంతో నిరుత్సాహానికి గురిచేశాయని, పార్టీ తనపై పెట్టిన బాధ్యతలను సరిగా నిర్వర్తించలేకపోయానని అందులో పేర్కొన్నారు. కాబట్టి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు.
ఒడిశాలో మొత్తం 21 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. 147 అసెంబ్లీ స్థానాల్లో 9 స్థానాల్లో గెలుపొందింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ కూడా ఓటమి పాలయ్యారు. దీంతో తీవ్ర నిరాశలో కూరుకుపోయిన నిరంజన్ పార్టీని విజయ పథాన నిలబెట్టలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
మరోవైపు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ కూడా తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తల్లి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా దృష్టికి తీసుకెళ్లగా ఆమె వారించినట్టు సమాచారం.