Telangana: ప్రతిపక్ష నాయకుడిపై చెడుగా చెబితే నీలం సంజీవరెడ్డి ఊరుకోలేదు.. అది సంస్కారం!: జయప్రకాశ్ నారాయణ
- ప్రత్యర్థుల పట్ల కనీస గౌరవ మర్యాదలు లేవు
- మాజీ సీఎం నీలం సంజీవరెడ్డిని కొనియాడిన జేపీ
- ప్రతిపక్షనాయకుడి గురించి చెడుగా చెబితే ఆయన ఊరుకోలేదట
‘కులం’ అనే విషాన్ని రాజకీయాల నుంచి, సమాజం నుంచి నిర్మూలించకపోతే అందరూ నాశనమవుతారని జయప్రకాశ్ నారాయణ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థుల పట్ల కనీస గౌరవ మర్యాదలు, సద్భావన ఏమాత్రం లేకుండా పోయాయని, ఈ విషయం యావత్తు దేశానికి, ముఖ్యంగా ఏపీకి ప్రత్యేకంగా వర్తిస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గురించి ఓ గొప్ప విషయం చెప్పారు. ఇది ఎవరో తనకు చెప్పారని, అది నిజమో కాదో తనకు తెలియదంటూ దాని గురించి వివరించి చెప్పారు. "నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గౌతు లచ్చన్న ప్రతిపక్ష నాయకుడిగా ప్రధాన పాత్ర పోషించారు. ఓసారి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు నీలం సంజీవరెడ్డి వెళ్లిన సమయంలో, కారులో ఆయనతో పాటు ఉన్న ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడొకరు అదే పనిగా గౌతు లచ్చన్న గురించి చెడుగా చెప్పారని, దీంతో, వెంటనే కారు ఆపేసి ఆ వ్యక్తిని కారులో నుంచి దింపేసి నీలం వెళ్లిపోయారట.. ‘అది సంస్కారం’' అంటూ జేపీ కొనియాడారు.
రాజకీయాల్లో పోటీ ఉంటుందని, ఆ పోటీ వ్యక్తిగతమైన స్పర్థలు, కక్షలు కార్పణ్యాలు, ఒకరిని మరొకరు రాక్షసులుగా చిత్రించుకునేలా ఉండకూడదని హితవు పలికారు. టీడీపీ ఏమో జగన్ ని ‘రాక్షసుడి’గా, వైసీపీ ఏమో చంద్రబాబును ‘రాక్షసుడి’గా చిత్రీకరిస్తూ వ్యాఖ్యలు చేయడం నాగరికతతో కూడిన పని కాదని, ‘ఇది చాలా లేకి రాజకీయం’ అని జేపీ విమర్శించారు.