Andhra Pradesh: వైసీపీ 400 మందిని టార్గెట్ చేసింది.. అందులో మొదటివాడిని నేనే!: టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి
- ఏపీలో ఊహకు అందని ఫలితాలు వచ్చాయి
- బీజేపీ 4 లోక్ సభ స్థానాలు సాధించడం ఏంటి?
- హిమకుంటలో వైసీపీకి ఆధిక్యం వచ్చింది
- కడపలో మీడియాతో టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది టీడీపీ నేతలను టార్గెట్ చేసిందనీ, వారిలో తాను మొదటిస్థానంలో ఉన్నానని వ్యాఖ్యానించారు. కడప జిల్లాలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఊహకు అందని ఫలితాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ సీటు గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా నాలుగు లోక్ సభ స్థానాల్లో విజయం సాధించడం ఏంటని ప్రశ్నించారు.
తమకు ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. తనను వ్యతిరేకిస్తే నష్టపరుస్తానని మోదీ ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపించారని విమర్శించారు. బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలకు అనుకూల ఫలితాలు వచ్చాయని ఆరోపించారు. చంద్రబాబునాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల చంద్రబాబుకు ఓట్లు తగ్గాయని తెలిపారు.
హిమకుంట గ్రామంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తే అక్కడ వైసీపీకే ఆధిక్యత వచ్చిందని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో అభివృద్ధి చేశామనీ, అయితే ఇలాంటి తీర్పు వస్తుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు.