Nara Lokesh: ఇవేవీ ప్రజాసేవకు ఆటంకం కాదనుకుంటున్నా: నారా లోకేశ్
- మంగళగిరిలో ఓటమిపై స్పందన
- రాజకీయాల్లో గెలుపోటములు సహజం
- ఇకపైనా ప్రజల్లోనే ఉంటాను
మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమిపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో లోకేశ్ పరాజయం పాలయ్యారు. దీనిపై వ్యాఖ్యానిస్తూ, మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. అయినా, రాజకీయాల్లో గెలుపోటములు సహజం అని, ప్రజాసేవకు ఏదీ అడ్డంకి కాబోదని పేర్కొన్నారు. ఓటమిపాలైనా ఇకముందు కూడా ప్రజల్లోనే ఉండి ప్రజల కోసం పనిచేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు.
2014లో గెలిచాక టీడీపీ ఈ ఐదేళ్లపాటు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో పాటుపడిందని, అయితే, ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరోధార్యంగా భావిస్తోందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తాము ప్రజల కోసమే పనిచేస్తామని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ ఎన్నికల్లో ఘనవిజయాలు నమోదు చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత జగన్ లకు శుభాభినందనలు తెలియజేశారు.