Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్... వద్దని వారించిన సోనియా!
- పార్టీ ఓటమికి నైతిక బాధ్యత తీసుకున్న రాహుల్
- ఓటమిని అంగీకరిస్తున్నానంటూ ప్రకటన
- తమది సిద్ధాంతపరమైన పోరాటం అంటూ వివరణ
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం తన రాజీనామా లేఖను పార్టీ పెద్ద దిక్కు సోనియా గాంధీకి పంపారు. అయితే, రాహుల్ రాజీనామాను సోనియా తిరస్కరించారు. పార్టీకి రాహుల్ సేవలు అవసరమంటూ తనయుడ్ని సున్నితంగా వారించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, ప్రజానిర్ణయమే శిరోధార్యమని, ఓటమిని అంగీకరిస్తున్నామని చెప్పారు. క్షేత్రస్థాయిలో పోరాడిన కార్యకర్తలకు అభినందనలు తెలుపుకున్న రాహుల్, తమది సిద్ధాంతపరమైన పోరాటం అని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు ఒకటే చెబుతున్నా, ఫలితాల పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దు, జంకవద్దు, పోరాటం కొనసాగిద్దాం అంటూ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం పెంపొందించేలా మాట్లాడారు.