Rafale: పారిస్ లోని భారత వాయుసేన 'రాఫెల్' కార్యాలయంలో చోరీకి యత్నం
- ఆఫీసులో ప్రవేశించేందుకు ప్రయత్నించిన దుండగులు
- భారత వాయుసేనకు సమాచారం అందించిన డసో సంస్థ
- ఘటనపై అనుమానాలు
ఫ్రాన్స్ తయారీ రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత వాయుసేన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 36 రాఫెల్ జెట్ ఫైటర్ల కోసం భారత్ ఒప్పందం కుదుర్చుకోగా, తన అవసరాలకు అనుగుణంగా ఆ యుద్ధ విమానాల్లో మార్పులు చేర్పులు చేయించుకునేందుకు వీలుగా భారత వాయుసేన పారిస్ లో తాత్కాలికంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుంది. గ్రూప్ కెప్టెన్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఇక్కడి ఆఫీసు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యాలయంలో ఆదివారం రాత్రి కొందరు దుండగులు దొంగతనానికి ప్రయత్నించడం భారత వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
పారిస్ నగర శివారు ప్రాంతంలో ఉన్న ఈ కార్యాలయంలో ప్రవేశించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించినట్టు రాఫెల్ తయారీ సంస్థ డసో ఏవియేషన్స్ భారత వాయుసేనకు సమాచారం అందించింది. రాఫెల్ ఒప్పందం అవినీతిమయం అంటూ భారత్ లో విపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పత్రాలు లీకవడం ఇప్పటికే తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ పత్రాలు చోరీకి గురయ్యాయని చెప్పిన కేంద్రం ఆపై మాట మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పారిస్ లోని భారత వాయుసేన రాఫెల్ కార్యాలయంలో చోరీకి ప్రయత్నం జరగడంపై పలు సందేహాలు కలుగుతున్నాయి.