TV9: రవిప్రకాశ్ వాదనపై మండిపడ్డ టీవీ9 నూతన యాజమాన్యం!
- టీవీ9 లోగో తనదన్న రవిప్రకాశ్
- ఖండించిన నూతన యాజమాన్యం
- అక్రమాలకు పాల్పడ్డాడంటూ ప్రత్యారోపణలు
గత కొన్నిరోజులుగా టీవీ9 చానల్ నూతన యాజమాన్యానికి, మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు మధ్య తీవ్రస్థాయిలో పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, టీవీ9 లోగోను సృష్టించింది తానేనని, తనకు రాయల్టీ చెల్లించాల్సి వస్తుందనే తప్పుడు కేసులు పెట్టారని రవిప్రకాశ్ ఓ వీడియో విడుదల చేశారు. అంతేకాదు, తనను ఓ పాలేరులా పనిచేయాలంటూ 'మై హోమ్' రామేశ్వర్ రావు పేర్కొన్నారంటూ రవిప్రకాశ్ ఆ వీడియోలో ఆరోపించారు.
అయితే, రవిప్రకాశ్ ఈ వీడియో విడుదల చేయడంపై టీవీ9 నూతన యాజమ్యానం మండిపడింది. తప్పుడు కేసులు పెట్టారని ఆరోపణలు చేస్తున్న రవిప్రకాశ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకాకుండా ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడో చెప్పాలని ప్రశ్నించింది. టీవీ9 చానల్ కు చెందిన లోగో రవిప్రకాశ్ సొంతం ఎలా అవుతుందని నిలదీసింది. టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్ బోర్డులో మెజారిటీ వాటా లేకపోయినా సంస్థపై ఆధిపత్యం చూపేందుకు రవిప్రకాశ్ ప్రయత్నించేవాడని టీవీ9 నూతన యాజమాన్యం ప్రత్యారోపణలు చేసింది. పలు అక్రమాలకు పాల్పడినందువల్లే రవిప్రకాశ్ బయటికి రావడంలేదని విమర్శించింది.