Spyder: ఒక తప్పుకు ఆరుగురు బలి... సొంత హెలికాప్టర్ ను కూల్చేసిన భారత వాయుసేన మిసైల్!
- ఫిబ్రవరి 27న గాల్లోనే పేలిపోయిన చాపర్
- ఆరుగురు దుర్మరణం
- కిందనుంచి వదిలిన 'స్పైడర్' కారణమని తేల్చిన అధికారులు
ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన ఎంఐ-17 హెలికాప్టర్, క్షణాల వ్యవధిలో కూలిపోయి, ఆరుగురు భారత వాయుసేన ఉద్యోగులు దుర్మరణం పాలవగా, ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చినట్టు తెలుస్తోంది. శ్రీనగర్ ఎయిర్ బేస్ నుంచి ఇజ్రాయిల్ తయారీ మిసైల్ 'స్పైడర్'ను ప్రయోగించగా, అది కేవలం 12 సెకన్ల వ్యవధిలోనే ఎంఐ-17ను ఢీకొందని, దీంతో గాల్లోనే చాపర్ పేలిపోయిందని అధికారులు తేల్చారు.
ఈ కేసులో ఎయిర్ బేస్ లోని ఉద్యోగులపై మిలటరీ చట్టాల కింద శిక్షించదగిన హత్యా నేరం (కల్పబుల్ హోమిసైడ్) ఆరోపణలను నమోదు చేయనున్నామని అధికారులు తెలిపారు. గాల్లోకి టేకాఫ్ తీసుకున్న చాపర్ లోని వారికి తమను ఓ మిసైల్ వెంబడిస్తోందన్న విషయం కూడా తెలియదని, భూ ఉపరితలం నుంచి గాల్లోని లక్ష్యాలను పేల్చేయగల ఈ 'స్పైడర్' తన టార్గెట్ ను ఎందుకు మార్చుకుందన్న విషయమై లోతైన విచారణ జరుగుతుందని అధికారులు అన్నారు.