BJP: బీజేపీ అవకతవకలకు పాల్పడితే రక్తం ఏరులై పారుతుంది: ఆర్‌ఎల్‌ఎస్‌పీ నేత ఉపేంద్ర కుష్వహా వివాదాస్పద వ్యాఖ్యలు
- ప్రైవేటు వాహనాల్లో ఈవీఎంల తరలింపుపై అభ్యంతరం
- అడిగినా సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం
- హింస చెలరేగితే వారిదే బాధ్యత
కేంద్రంలోని అధికార బీజేపీ అవకతవకలకు పాల్పడితే జనం చూస్తూ ఊరుకోరని, హింస చెలరేగి రక్తం ఏరులైపారితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్‌ఎల్‌ఎస్‌పీ) నాయకుడు ఉపేంద్ర కుష్వహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్‌ల్లో ప్రైవేటు వాహనాల్లో ఈవీఎంల తరలింపులపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉపేంద్ర ‘ప్రైవేటు వాహనాల వినియోగంపై జనం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే సరైన సమాధానం కూడా రావడం లేదు’ అని మండిపడ్డారు.
అధికార పార్టీ ఆగడాలను చూస్తూ ఊరుకోమని, ఆత్మరక్షణ కోసం ఆయుధాలు చేపట్టి ఎలా పోరాడుతామో, మా ఓట్ల కోసం అలాగే పోరాడుతామని, ఆ సందర్భంగా హింస చెలరేగితే ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం ఎన్నికల ప్రచారం సందర్భంగా తాము గమనించామని, అందుకే అధికార పార్టీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్టీయే ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టిన ఉపేంద్ర ఎన్నికల ముందు ఆ పార్టీకి రెండే సీట్లు ఇస్తామని బీజేపీ స్పష్టం చేయడంతో బయటకు వచ్చిన విషయం గమనార్హం.