Himachal Pradesh: మాక్ పోలింగ్ ఓట్లను తొలగించడం మరచిన అధికారులు.. కవర్ చేసుకునేందుకు అసలు ఓట్ల తొలగింపు!

  • పోలింగ్‌కు గంట ముందు మాక్ పోలింగ్
  • డిలీట్ చేయకుండానే పోలింగ్ కొనసాగింపు
  • 20 మందిపై క్రమశిక్షణ చర్యలు

పోలింగ్‌కు ముందు నిర్వహించిన మాక్ పోలింగ్ ఓట్లను తొలగించడం మర్చిపోయి.. ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దుకునేందుకు అసలైన ఓట్లను డిలీట్ చేశారు హిమాచల్ ‌ప్రదేశ్ ఎన్నికల అధికారులు. మొత్తం 5 పోలింగ్ కేంద్రాల్లో ఇలాగే జరిగింది. విషయం బయటకు రావడంతో 20 మంది అధికారులపై ఎన్నికల సంఘం క్షమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఈ ఘటనపై ఎన్నికల సంఘం దర్యాప్తు ప్రారంభించిందని, ఐదుగురు ప్రిసైడింగ్ అధికారులు, 15 మంది పోలింగ్ అధికారులపై వేటుకు ఈసీ సిద్ధమైందని హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల అధికారి దేవేశ్ కుమార్ తెలిపారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఈవీఎంలు సరిగా పనిచేస్తున్నాయో, లేదో తెలుసుకునేందుకు పోలింగ్‌కు గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. 50 ఓట్లు వేసి వాటిని పరీక్షిస్తారు. అనంతరం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో వాటిని డిలీట్ చేస్తారు. అయితే, హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన చివరి విడత ఎన్నికల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈ టెస్ట్ ఓట్లను తొలగించడాన్ని అధికారులు మర్చిపోయారు. ఆ తర్వాత తప్పు తెలుసుకుని అసలు ఓట్లను తొలగించారు. విషయం వెలుగులోకి రావడంతో ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.

  • Loading...

More Telugu News