CEC: ఏ పార్టీకి ఓటు వేసినా ఒకే పార్టీకి పడుతోందని సీఈసీకి ఫిర్యాదు చేసాం: గులాం నబీ ఆజాద్
- సీఈసీతో గంటన్నరపాటు సమావేశమయ్యాం
- ఈవీఎంలలో సమస్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లాం
- తేడా వస్తే అసెంబ్లీ పరిధిలోని మొత్తం ఓట్లు లెక్కించాలి
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను ఎన్డీయేతర పక్షాల నేతలు కలిశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి తమ ఫిర్యాదులను అందించారు. అనంతరం, మీడియాతో ఆజాద్ మాట్లాడుతూ, సీఈసీతో గంటన్నరపాటు సమావేశమైనట్టు చెప్పారు. ఈవీఎంలలో సమస్యలు ఉన్నాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, ఏ పార్టీకి ఓటు వేసినా ఒకే పార్టీకి పడుతోందని ఫిర్యాదు చేశామని అన్నారు. ఈవీఎం, వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే అసెంబ్లీ పరిధిలోని మొత్తం ఓట్లు లెక్కించాలని ఆజాద్ డిమాండ్ చేశారు.
వందశాతం వీవీప్యాట్స్ లెక్కించాలన్నదే మా ప్రధాన డిమాండ్: సింఘ్వీ
ఒకటిన్నర నెలలుగా లేవనెత్తిన అంశాలనే మళ్లీ ఈసీకి చెప్పామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. తాము చేసిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఈసీని ప్రశ్నించినట్టు పేర్కొన్నారు. తాము చెప్పిన విషయాలను సుమారు గంట సేపు ఈసీ అధికారులు విన్నారని అన్నారు. తాము చేసిన ఫిర్యాదుల విషయమై మాట్లాడేందుకు రేపు ఉదయం సమావేశం కానున్నట్లు ఈసీ అధికారులు తమకు చెప్పారని అన్నారు. వందశాతం వీవీప్యాట్స్ లెక్కించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని సింఘ్వీ మరోసారి స్పష్టం చేశారు.