Andhra Pradesh: ఎల్వీ సుబ్రహ్మణ్యం నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ.. డీజీపీకి శాప్ మాజీ చైర్మన్ ఫిర్యాదు !
- 2015లో శాప్ చైర్మన్ గా పీఆర్ మోహన్ నియామకం
- అప్పుడు క్రీడా శాఖా ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎల్వీ
- ప్రభుత్వ ఉత్తర్వుల అమలులో ఎల్వీ జాప్యం చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు
సుమారు నాలుగేళ్ల క్రితం ఏపీ క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పటి ప్రభుత్వ ఉత్తర్వుల అమలులో జాప్యం చేయడంతో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ పదవిని తాను పొందలేకపోయానని ఆరోపిస్తూ పోలీసులకు పీఆర్ మోహన్ ఫిర్యాదు చేశారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015 జనవరి 28న ఆయన్ని శాప్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వుల అమలులో తీవ్ర జాప్యం జరిగింది. గతంలో పలు పర్యాయాలు శాప్ చైర్మన్ గా పీఆర్ మోహన్ వ్యవహరించారు.
ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ఠాకూర్ కు మోహన్ ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీని ఈరోజు కలిశారు. నాడు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేశారని, ఓ ఉన్నతాధికారి ఉదాసీన వైఖరితో తాను మనో వేదనకు గురయ్యానని తన ఫిర్యాదులో మోహన్ ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు.
ఈ విషయమై శ్రీకాళహస్తిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ నెల 8న ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని తిరుపతి అర్బన్ ఎస్పీని ఠాకూర్ ఆదేశించినట్టు సమాచారం.