Manasa Sarovara: ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కైలాస మానస సరోవరం!
- హిమాలయాల్లో ఉన్న మానస సరోవరం
- భారత పరిధిలోని ప్రాంతానికి యునెస్కో గుర్తింపు
- వెల్లడించిన కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ
హిమాలయ పర్వతాల్లో, అత్యంత పవిత్రమైన కైలాసగిరికి సమీపంలో ఉండే మానస సరోవరం మరో ఘనతను దక్కించుకుంది. భారత భూభాగం పరిధిలో ఉన్న మానస సరోవరాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చేందుకు ఐక్యరాజ్య సమితి అనుబంధ 'యునెస్కో' అంగీకరించింది. ప్రస్తుతానికి వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో సరస్సు ఉంటుందని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారికంగా ప్రకటించింది.
గడచిన ఏప్రిల్ లో భారత పురావస్తు విభాగం నుంచి వెళ్లిన ప్రతిపాదనలను చర్చించిన యునెస్కో, ఈ మేరకు ఆమోదముద్ర వేసినట్టు తెలిపింది. కాగా, కైలాస మానస సరోవరం ప్రాంతంలో ఎక్కువ భాగం భారత్ లో ఉండగా, నేపాల్, ఉత్తరాన చైనాల పరిధిలోనూ కొంత ఉందన్న సంగతి తెలిసిందే. మూడు దేశాల పరిధిలో 31 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ పవిత్ర సరస్సు విస్తరించివుంది. కాగా, తమ దేశాల పరిధిలోని మానస సరోవరం ప్రాంతాలను కూడా వారసత్వ ప్రదేశంగా గుర్తించాలని యునెస్కోకు చైనా, నేపాల్ ఇప్పటికే ప్రతిపాదనలు పంపాయి.