Lok Sabha: ఓటేయని తేజస్వీ యాదవ్.. ఎందుకు వేయలేదో తనకు తెలుసన్న బీజేపీ నేత!
- తన కుటుంబం నుంచి ప్రధాని రేసులో ఎవరూ లేరని ఓటేయలేదన్న బీజేపీ
- తేజస్వీ యాదవ్ ఓటేయకపోవడం దారుణమన్న జేడీయూ
- ఫొటో మ్యాచ్ కాకపోవడం వల్లే ఓటేయలేకపోయారన్న ఆర్జేడీ
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఆదివారం జరిగిన చివరి విడత ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. తన కుటుంబం నుంచి ప్రధాని రేసులో ఎవరూ లేకపోవడంతోనే తేజస్వీ ఓటు వేయలేదని బీజేపీ అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ ఆరోపించారు. నిజానికి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని తేజస్వీ అంగీకరించలేకపోతున్నారని అన్నారు.
జైలులో ఉన్న తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ పేరుతో ప్రచారం చేసి ఆర్జేడీకి ఓటేయమని కోరుతూ రాష్ట్రం మొత్తం తిరిగిన తేజస్వీ తాను మాత్రం ఓటేయకపోవడం దారుణమని జేడీయూ ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ అన్నారు. అయితే, వీరి ఆరోపణలను ఆర్జేడీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ శివానంద్ తివారీ కొట్టిపడేశారు. ఓటరు లిస్టులోని ఫొటోతో, కార్డు మీదున్న ఫొటోకు పొంతన లేకపోవడంతో తేజస్వీ యాదవ్ ఓటు వేయలేకపోయారని వివరించారు.