Andhra Pradesh: పోలింగ్ రోజున వైసీపీ శ్రేణులు అలజడులు సృష్టిస్తాయి.. కట్టుదిట్టమైన భద్రతను కల్పించండి!: కనకమేడల రవీంద్ర కుమార్
- పారదర్శకంగా లెక్కింపు జరిగే చర్యలు తీసుకోండి
- పోలింగ్ రోజున ఈవీఎంల సీలింగ్ లను లెక్కించండి
- సీఈసీ అరోరాతో సమావేశమైన టీడీపీ నేత
ఓట్ల లెక్కింపు సందర్భంగా పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఢిల్లీలో సీఈసీ అరోరాను కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు ఎలాంటి పత్రాలు తీసుకురావొద్దని రిటర్నింగ్ అధికారులు(ఆర్వో) చెప్పడం సరికాదని కనకమేడల అభిప్రాయపడ్డారు.
పోలింగ్ నాటి వివరాలను సరిపోల్చుకునే అవకాశం రాజకీయ పార్టీల ఏజెంట్లకు ఇవ్వాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ అరోరాను కోరినట్లు చెప్పారు. ఈవీఎంల కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లను బయటకు పంపించవద్దని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు రోజున సీలింగ్ ఉన్న ఈవీఎంలను మరోసారి లెక్కించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 23న పోలింగ్ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద వైసీపీ శ్రేణులు అలజడులు సృష్టించే అవకాశముందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని అన్నారు.