Telangana: ‘పంజాగుట్ట నిమ్స్’ లో తలసాని అనుచరుల వీరంగం.. ప్రభుత్వ డాక్టర్ పై దాడి!
- ప్రమాదంలో గాయపడ్డవారిని ఆసుపత్రికి తీసుకొచ్చిన యువకులు
- వైద్యులు పట్టించుకోవడం లేదని ఆసుపత్రిలో హల్ చల్
- రంగంలోకి పోలీసులు.. స్టేషన్ కు యువకుల తరలింపు
తెలంగాణలోని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో ఉద్రిక్తత తలెత్తింది. నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో కొందరు గాయపడటంతో వారి బంధువులు పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే విధుల్లో ఉన్న డాక్టర్ వెంటనే కేసు అటెండ్ చేయకపోవడంతో బంధువులు సహనం కోల్పోయారు. దుర్భాషలాడుతూ డ్యూటీలో ఉన్న డాక్టర్ పై దాడికి దిగారు. ఈ సందర్బంగా సుశీల్ అనే యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమవారిని నిమ్స్ కు తీసుకొచ్చినా వైద్యులు కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వెంటనే చికిత్స ప్రారంభించాలని కోరినా పట్టించుకోలేదని స్పష్టం చేశారు. తాము మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అనుచరులమని చెప్పిన యువకుడు, తన సహచరులతో కలిసి డ్యూటీలో ఉన్న వైద్యుడిపై చేయి చేసుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వీరిని స్టేషన్ కు తరలించారు. కాగా, వైద్యుడి నుంచి ఫిర్యాదు అందకపోవడంతో తాము ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్పష్టం చేశారు.