exit polls: ఆస్ట్రేలియాలో 56 ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి: శశి థరూర్
- అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు కావు
- నిజాన్ని బయటకు చెప్పుకోవడానికి భారత ప్రజలు భయపడతారు
- ఫలితాల కోసం 23 వరకు వేచి చూడాల్సిందే
దేశ ప్రజలు మళ్లీ ఎన్డీయేకే పట్టం కట్టారంటూ ఎగ్టిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ స్పందిస్తూ, ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలకిందులవుతాయని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ మొత్తం తప్పేనని తాను కచ్చితంగా చెప్పగలనని ఆయన అన్నారు. గత వారాంతంలో ఆస్ట్రేలియాలో వెల్లడైన 56 ఎగ్జిట్ పోల్స్ తప్పేనని తేలిపోయిందని చెప్పారు.
'అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పు అవుతాయని నేను భావించడం లేదు. గత వారం ఆస్ట్రేలియాలో 56 వివిధ ఎగ్జిట్ పోల్స్ తప్పుగా తేలాయి. భారత్ లో చాలా మంది ప్రజలు భయంతో తమ అంతరంగాన్ని సర్వేలు చేసే వారితో చెప్పుకోరు. తాము ఎవరికి ఓటు వేయబోతున్నామో, ఎవరికి వేశామో అనే నిజాన్ని చెప్పడానికి భయపడతారు. దీంతో, ఎగ్జిట్ పోల్స్ తారుమారవుతాయి. ఈ నేపథ్యంలో, ఫలితాల కోసం మే 23 వరకు వేచి చూడక తప్పదు' అని శశి థరూర్ తెలిపారు.