Rallapalli: చాలామంది అబద్ధాలు చెప్పి రాళ్లపల్లి నుంచి డబ్బులు తీసుకునేవారు: తనికెళ్ల భరణి
- ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకునేవారు
- నేను వెళ్లి తిట్టేవాణ్ణి
- కిళ్లీ కోసం వెళుతున్నానని చెప్పి వాళ్లకు మళ్లీ డబ్బిచ్చేవారు
సీనియర్ నటుడు, రచయిత రాళ్లపల్లి మృతి నేపథ్యంలో ఆయనతో తన అనుబంధాన్ని నెమరవేసుకున్నారు తనికెళ్ల భరణి. ఇతరులకు సాయం చేయడంలో రాళ్లపల్లి గారి తర్వాతే ఎవరైనా అని భరణి అభిప్రాయపడ్డారు. సరిగ్గా చెప్పాలంటే సాయం చేయడం అనేది ఆయనకో వ్యసనం అని అన్నారు. చాలామంది ఆయన మంచితనాన్ని అలుసుగా తీసుకుని అబద్ధాలు చెప్పి డబ్బులు తీసుకునేవాళ్లని, అలాంటివాళ్లను తాను తిట్టి పంపించిన సందర్భాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే, కిళ్లీ తెచ్చుకోవడానికి వెళుతున్నాన్రా అని చెప్పి బయటికెళ్లి వాళ్లకు డబ్బులు ఇచ్చేవాడని తనికెళ్ల భరణి వివరించారు. ఎలాంటి సాయం కోరి వచ్చినా కాదనకుండా చేసేవారని పేర్కొన్నారు.
ఇక తన గురించి చెబుతూ, రాళ్లపల్లి గారు లేకుంటే ఇవాళ తాను లేనని అన్నారు. సినిమాలంటే తన తండ్రికి ఇష్టంలేకపోవడంతో ఆయన ఇంట్లోంచి వెళ్లగొట్టాడని, దాంతో తాను నేరుగా రాళ్లపల్లి గారింటికే వెళ్లానని భరణి చెప్పారు. రాళ్లపల్లి గారు ఎంతో పెద్ద మనసుతో సొంత కొడుకులా ఆదరించాడని గుర్తుచేసుకున్నారు. "అప్పట్లో డబ్బు అడగడానికి మొహమాట పడతానని చెప్పి, నేను నిద్రలేవకముందే ఆయన నా ప్యాంట్ జేబులో రూ.100 నోటు పెట్టేసి ఏమీ తెలియనట్టే బయటికి వెళ్లిపోయేవారు" అని భరణి వెల్లడించారు. తనను దర్శకుడు వంశీకి పరిచయం చేసింది రాళ్లపల్లి గారేనని, లేడీస్ టైలర్ సినిమాతో తన జీవితం మారిపోయిందని, ఇదంతా రాళ్లపల్లి గారి చలవేనని తెలిపారు.