Andhra Pradesh: టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చిన ఎన్నికల సంఘం!
- అనంత సీటుకు రూ.50 కోట్లు ఖర్చు పెట్టారన్న జేసీ
- ఆయన వ్యాఖ్యలపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు
- విచారణకు ఆదేశించిన కలెక్టర్ వీరపాండియన్
టీడీపీ నేత, అనంతపురం లోక్ సభ సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డికి ఊరట లభించింది. ఇటీవల ఎన్నికల్లో అనంతపురంలో పార్టీలన్నీ రూ.50 కోట్లు ఖర్చుచేశాయని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై వైసీపీ నేతల ఫిర్యాదుతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రిటర్నింగ్ అధికారి(ఆర్వో) ప్రభాకర్ రెడ్డి జేసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదని నివేదిక సమర్పించారు.
జేసీ ఇతర పార్టీల నేతలను ఉద్దేశించి మాత్రమే రూ.50 కోట్లు అనే వ్యాఖ్య చేశారనీ, ఎవరి పేరును నేరుగా ప్రస్తావించలేదని నివేదికలో ఆర్వో స్పష్టం చేశారు. కాబట్టి ఈ వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘన కిందకు రావని తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ధన ప్రవాహం పెరిగిపోయిందని, దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు రూ.10,000 కోట్లు ఖర్చు చేశాయని జేసీ అప్పట్లో వ్యాఖ్యానించారు. మొదట్లో పోటీకి రూ.లక్ష, రెండోసారి రూ.25 లక్షలు ఖర్చు పెట్టారనీ, కానీ ఇప్పుడు రూ. 25 కోట్లు లేకుంటే పోటీ చేసే పరిస్థితే లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క అనంతపురంలోనే రూ.50 కోట్లు ఖర్చు పెట్టారని వ్యాఖ్యానించారు.