Guntur District: అదో పీడకల...ప్రాణాలు దక్కుతాయనుకోలేదు : గుప్త నిధుల కోసం వెళ్లిన కృష్ణనాయక్ వెల్లడి
- నా మూత్రం నేనే తాగి ప్రాణాలు నిలుపుకున్నా
- నీరందక ఇద్దరి మృత్యువాత
- ప్రాణాలతో బయటపడిన గుంటూరు జిల్లా వాసి
ప్రాణాలు దక్కుతాయన్న ఆశలేని సమయంలో ఏదోలా మైదాన ప్రాంతానికి చేరడం అదృష్టమేనని గుప్త నిధుల వేటకు వెళ్లిన ముగ్గురిలో ప్రాణాలతో మిగిలిన కృష్ణనాయక్ వెల్లడించారు. ‘అదో పీడకల. రుద్రాక్షల కోసం అని చెప్పి నన్ను అటవీ ప్రాంతానికి తోడ్కోని వెళ్లారు. తీరా కొంత దూరం వెళ్లాక పరిస్థితి అర్థమయింది. మండిపోతున్న ఎండలో అటవీ ప్రాంతంలో సంచారం ఎంత కష్టమో అర్థమయింది. వెనుదిరిగినా ప్రాణాలు దక్కుతాయనుకోలేదు. నా మూత్రాన్నే రెండు రోజులు మంచినీరుగా తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాను’ అని కృష్ణనాయక్ చెప్పారు.
గుంటూరు జిల్లాకు చెందిన హనుమంతనాయక్, కృష్ణనాయక్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన శివకుమార్ ఆదివారం ప్రకాశం జిల్లాలోని వెలుగొండ అటవీ ప్రాంతంలోకి గుప్త నిధుల వేట కోసం వెళ్లిన విషయం విదితమే. వీరిలో శివకుమార్, హనుమంతనాయక్ చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన కృష్ణకుమార్ మీడియాతో మాట్లాడారు.
రుద్రాక్షల కోసం వెళ్తున్నామని తన బాబాయ్ హనుమంతనాయక్, బ్యాంకు ఉద్యోగి శివకుమార్ నన్ను మభ్యపెట్టి తీసుకువెళ్లారని, దారి మధ్యలో వారు గుప్త నిధుల వేటకు బయలు దేరారని అర్థమయ్యిందని చెప్పారు.
‘వెలుగొండ అటవీ ప్రాంతంలో పెద్ద లోయలు దాటుకుంటూ చాలా దూరం వెళ్లాం. అప్పటికి మా వద్ద ఉన్న 15 మజ్జిగ ప్యాకెట్లు, ఓ మంచినీటి బాటిల్ అయిపోయాయి. అప్పటికే మిట్టమధ్యాహ్నం కావడంతో దాహంతో గొంతు తడారిపోయింది. వెనక్కి వెళ్లిపోదామనుకున్నాం. వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో కలిసిన స్వామీజీలతో మాట్లాడాక వెనుదిరగాలని స్థిరంగా నిర్ణయించుకున్నాం' అని తెలిపారు.
'కనీసం ఒక్కరిమైనా మైదాన ప్రాంతానికి చేరుకుంటే మిగిలిన ఇద్దరినీ కాపాడుకోవచ్చని భావించి నన్ను తొందరగా వెళ్లమన్నారు. ఒక పగలు, ఒక రాత్రి ప్రయాణించా. గొంతెండిపోతున్న సమయంలో నేను మధ్యలో నాలుగు సార్లు నా మూత్రం నేనే తాగా. ఎలాగోలా అటవీ ప్రాంతం దాటి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు చేరుకుని స్పృహతప్పి పడిపోయాను. ఆలయ పూజారి ముఖం మీద నీళ్లు చల్లి నన్ను కాపాడాడు’ అని కృష్ణనాయక్ తన ప్రయాణ గాథ విడమర్చి చెప్పారు.