Vulture: భాగ్యనగరానికి బంధువు.. 20 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో కనిపించిన రాబందు!
- వేగంగా అంతరించి పోతున్న పక్షిజాతుల్లో తెల్లవీపు రాబందు ఒకటి
- చివరిసారి 1999లో హైదరాబాద్‌లో కనిపించిన రాబందు
- ప్రస్తుతం జూపార్క్‌లో కోలుకుంటున్న పక్షి
అంతరించి పోతున్న పక్షిజాతుల్లో ఒకటైన రాబందు హైదరాబాద్‌లో కనిపించడంతో పక్షి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం భాగ్యనగరంలో చివరిసారిగా కనిపించిన రాబందు మళ్లీ ఇన్నాళ్లకు కనిపించింది. ఆసిఫ్‌నగర్ క్రాస్‌రోడ్స్ ప్రాంతంలో రాబందు ఉందన్న సమాచారంతో శుక్రవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో అక్కడికి వెళ్లిన అటవీశాఖ అధికారులు దానిని పట్టుకున్నారు. బాగా నీరసించి పోయి, ఎగరలేని స్థితిలో ఉన్న రాబందును నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు తరలించారు. నిన్న మధ్యాహ్నానికి రాబందు కొంత కోలుకుందని, మాంసం తీసుకుందని అటవీ అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఒకప్పుడు రాబందులు వందల సంఖ్యలో ఉండేవి. ఆ తర్వాత మారిన వాతావరణ పరిస్థితులు, ఆహారం దొరక్క పోకపోవడంతో ఒక్కొక్కటీ మాయమయ్యాయి. తెల్లవీపు కలిగిన రాబందులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అంతరించే దశలో ఉన్నాయి.
1999లో చివరిసారిగా హైదరాబాద్‌లోని హయత్‌నగర్ సమీపంలో ఉన్న ‘మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్’ పరిసరాల్లో ఈ తెల్లవీపు రాబందు కనిపించింది. అదే ఆఖరు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే. తెలంగాణలోని కాగజ్‌నగర్ ప్రాంతంలో రాబందులు ఉన్నా అవి పొడుగు మూతి రకం జాతి పక్షులని అధికారులు పేర్కొన్నారు.