Madhya Pradesh: ఈ పోలింగ్ బూత్ చాలా స్పెషల్ గురూ.. ఏసీ, టీ, కాఫీ, బిస్కెట్స్.. అబ్బో బోలెడన్ని సదుపాయాలు!
- మధ్యప్రదేశ్‌లోని జల్ సభాగృహ్ పోలింగ్ బూత్‌లో సకల సౌకర్యాలు
- ఆకట్టుకుంటున్న పోలింగ్ కేంద్రం
- ఉత్సాహంగా ఓటేస్తున్న ఓటర్లు
సాధారణంగా పోలింగ్ అనగానే కేంద్రం బయట చాంతాడంత క్యూ కనిపిస్తుంది. గంటల కొద్దీ లైన్లో నిలబడి ఓటు కోసం నిరీక్షించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడైనా ఇదే తీరు. తాగేందుకు నీళ్ల సదుపాయం కూడా ఉండదు. ఇక చంటి పిల్లల తల్లులకైతే ఓటు వేయడం ఎంత ఇబ్బందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే, మధ్యప్రదేశ్‌లోని జల్ సభాగృహ్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇక్కడ ఓటర్ల కోసం సకల సదుపాయాలు ఉంటాయి.
ఇక్కడి పోలింగ్ కేంద్రాన్ని పూర్తిగా ఎయిర్ కండీషన్డ్‌గా తీర్చిదిద్దారు. ఇండోర్ మేనేజిమెంట్ అసోసియేషన్, నగరపాలక సంస్థ, అధికార యంత్రాంగం సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు, చిన్న పిల్లలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారి కోసం కిడ్స్ జోన్, తమ వస్తువులను దాచుకునేందుకు సేఫ్టీ లాకర్, ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్, శుద్ధమైన తాగునీరు, టీ, కాఫీ, శీతలపానీయాలు, తినేందుకు బిస్కెట్లు.. ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు, దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు కలిగిన ఈ పోలింగ్‌బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.