Andhra Pradesh: ముఖ్యమంత్రి పదవికి అర్హులైన వారిలో జగన్ కూడా ఉన్నాడని అప్పట్లోనే హైకమాండ్ కు సూచించాను!: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య
- వైఎస్ ఆకస్మిక మరణంతో సీఎం అయ్యాను
- బాధ్యతలు స్వీకరించాలని సోనియా ఆదేశించారు
- ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ గవర్నర్
2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణంతో తాను ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చిందని మాజీ సీఎం, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య తెలిపారు. వైఎస్ మరణం తరువాత జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని తాను సూచించానని వెల్లడించారు. ‘జగన్ ఉన్నాడు. అతడిని సీఎంను చేయండి అని నేను నేరుగా చెప్పలేదు. ముఖ్యమంత్రి పదవికి అర్హులైనవారు ఓ 10 మంది ఉన్నారు. వారిలో జగన్ కూడా ఉన్నాడు అని చెప్పా’ అని స్పష్టం చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొణిజేటి రోశయ్య మాట్లాడారు.
కానీ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించాల్సిందిగా తనను సోనియాగాంధీ ఆదేశించారని రోశయ్య తెలిపారు. దీంతో కాదనలేకపోయానని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఓసారి వచ్చి కలిశాడని రోశయ్య గుర్తుచేసుకున్నారు. ఆయన్ను ఓదార్పు యాత్ర చేపట్టవద్దని కాంగ్రెస్ అధిష్ఠానమే ఆదేశించిందనీ, ఈ వ్యవహారంలో రాష్ట్ర కాంగ్రెస్ కు సంబంధం లేదని రోశయ్య అన్నారు. వైఎస్ మరణంతో మనో వేదనకు గురై చనిపోయినవారి కుటుంబ సభ్యులను జిల్లా కేంద్రాలకు పిలిపించి ఆర్థిక సాయం చేయాలని సోనియా సూచించారనీ, ఇందుకు జగన్ అంగీకరించలేదని రోశయ్య పేర్కొన్నారు.