Andhra Pradesh: మంత్రి భార్యను.. నన్నే టోల్ ఫీజు అడుగుతావా?.. ప్రత్తిపాటి పుల్లారావు భార్య హల్ చల్!

  • నల్గొండ జిల్లాలోని మాడుగుల పల్లి వద్ద ఘటన
  • టోల్ సిబ్బందితో మంత్రి భార్య వాగ్వాదం
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి హల్ చల్ చేశారు. ఓ టోల్ గేట్ వద్ద సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తన కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది కాబట్టి తాను టోల్ ఫీజు చెల్లించననీ, తనను ముందుకు పోనివ్వాలని డిమాండ్ చేశారు. తాను మంత్రి భార్యను అని గుర్తుచేశారు. అయితే, టోల్ ఫీజు కట్టకుండా కారును పోనిచ్చేందుకు అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దీంతో చివరికి చిర్రుబుర్రులాడుతూ టోల్ ఫీజు కట్టిన వెంకటకుమారి ముందుకు కదిలారు. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.

వెంకటకుమారి తన డ్రైవర్ తో కలిసి హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలోని మాడుగుల పల్లి టోల్ ప్లాజా వద్దకు రాగానే ఆమె కారును సిబ్బంది ఆపారు. టోల్ ఫీజుగా రూ.56 కట్టాలని సూచించారు. అయితే తాను మంత్రి భార్యననీ, తన కారుకు స్టిక్కర్ ఉందని వెంకటకుమారి చెప్పారు. తాను ఫీజును కట్టనని స్పష్టం చేశారు. అయితే కేవలం ఎమ్మెల్యే కారుకు మాత్రమే టోల్ మినహాయింపు ఉంటుందనీ, కుటుంబ సభ్యులకు ఉండదని టోల్ సిబ్బంది తేల్చిచెప్పారు.
 
 దీంతో వెంకటకుమారికి, టోల్ కేంద్రం నిర్వాహకుడికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ‘నువ్వు వితండవాదం చేస్తున్నావ్’ అని వెంకట కుమారి గద్దించగా, ‘మేం చేయట్లేదు మేడం మీరే వితండవాదం చేస్తున్నారు’ అని సదరు టోల్ కేంద్రం నిర్వాహకుడు తిప్పికొట్టాడు. చివరికి మరో మార్గం లేకపోవడంతో టోల్ ఫీజు కట్టేసి వెంకటకుమారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Loading...

More Telugu News