Tamil Nadu: మలేసియా నుంచి చెన్నైకి విమానంలో వచ్చి.. రైళ్లలో చోరీలు చేస్తున్న హోటల్ యజమాని!

  • సేలం వెళ్లే రైళ్లలో పెరిగిన చోరీలు
  • ప్రయాణికుల ఫిర్యాదుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు
  • నిందితుడు చెప్పింది విన్న పోలీసులకు షాక్

అతడు కుటుంబంతో సహా మలేసియాలో స్థిరపడ్డాడు. అక్కడో హోటల్ కూడా నిర్వహిస్తున్నాడు. అక్కడి నుంచే చెన్నై నుంచి బయలుదేరే రైళ్లలోని ఏసీ కోచుల్లో రిజర్వేషన్ చేయించుకుంటాడు. విమానంలో చెన్నై చేరుకుని రైలెక్కుతాడు. ఆ తర్వాత తోటి ప్రయాణికులను దోచుకుని పరారవుతాడు. తమిళనాడు పోలీసులు ఎట్టకేలకు అతడి ఆట కట్టించారు. అరదండాలు వేసి జైలుకు పంపారు.

చెన్నై నుంచి సేలం వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో అర్ధరాత్రి సమయంలో ఇటీవల చోరీలు ఎక్కువయ్యాయి. బాధిత ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఓ మహిళా పోలీసుతో కలిసి జంటలా ఒకరు, వారిని అనుసరిస్తూ మిగిలిన వారు రైలులో ప్రయాణించారు. ఈ క్రమంలో రైలులో ప్రయాణికుడి బ్యాగు తీసుకుని పారిపోతున్న వ్యక్తిని మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

విచారణలో అతడు చెప్పింది విని పోలీసులు విస్తుపోయారు. నిందితుడిని కేరళకు చెందిన సాహుల్‌ అమీద్‌(39)గా గుర్తించారు. కుటుంబంతో కలిసి అతడు మలేసియాలో స్థిరపడ్డాడని పోలీసులు తెలిపారు. మలేసియా నుంచి విమానంలో చెన్నై వచ్చి రైళ్లలో దొంగతనాలు చేస్తున్నట్టు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. అంతేకాదు, చోరీ సొత్తుతో మలేసియాలో ఓ హోటల్‌ను కూడా నడుపుతున్నట్టు చెప్పాడు.

అమీద్‌కు ఆరు భాషలు వచ్చని, ఇతడిపై గతంలోనూ కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అమీద్‌కు ఇద్దరు భార్యలని, పలువురు మహిళలపై అత్యాచారం చేసినట్టు కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే, విదేశాల్లో ఉద్యోగం పేరుతో పలువురిని మోసం చేసినట్టు వివరించారు. అమీద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి 110 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News