USA: ఆకలిగా ఉండడంతో దొంగతనం చేశానని చెప్పిన వ్యక్తి... చలించిపోయిన దుకాణం యజమాని
- అమెరికాలో ఘటన
- చోరీ చేసిన వ్యక్తికి ఆహారం ఇచ్చి పంపిన దుకాణదారు
- దుకాణం యజమాని చర్యకు సర్వత్రా ప్రశంసలు
చిన్న దొంగతనం చేస్తూ దొరికితే చాలు, చెట్టుకో పుట్టకో కట్టేసి చచ్చేదాకా కొడుతున్న రోజులివి. కానీ, తన షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి ఆకలితో ఉన్నాడని తెలిసి ఓ దుకాణదారు ప్రదర్శించిన మానవత్వం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అమెరికాలోని ఓహియోలో నివసించే జయ్ సింగ్ టోలెడో ప్రాంతంలో ఓ దుకాణం నిర్వహిస్తున్నారు. అందులో క్యాండీలు, తాజా ఆహారం విక్రయిస్తుంటారు.
ఒకరోజు ఓ యువకుడు షాపులో ప్రవేశించి ఎవరూ చూడడంలేదని భావించి అక్కడున్న చాక్లెట్లను తన జేబుల్లో నింపుకోవడం ప్రారంభించాడు. అయితే సీసీటీవీ తెరలపై ఇదంతా చూసిన షాపు యజమాని జయ్ సింగ్ వెంటనే ఆ యువకుడ్ని నిలదీశారు.
ఎందుకు చాక్లెట్లు దొంగతనం చేశావు? అని ప్రశ్నించడంతో, తాను, తన చిన్నతమ్ముడు ఆకలితో ఉన్నామని, అందుకే చోరీకి పాల్పడ్డానని ఆ కుర్రాడు చెప్పాడు. ఆకలి విలువ బాగా తెలిసిన జయ్ సింగ్ ఆ మాటకు బాగా కదిలిపోయారు అతడ్ని పోలీసులకు పట్టించే ఆలోచన విరమించుకుని తన షాపులో ఉన్న శాండ్ విచ్ లను పార్శిల్ చేసి ఆ యువకుడికి అందించారు.
అనంతరం ఓ వీడియోలో మాట్లాడుతూ, అతడ్ని చూస్తే దొంగతనాలే వృత్తిగా చేసుకున్న వ్యక్తిలా అనిపించలేదని, అందుకే అతడి ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.