West Bengal: ప్రత్యర్థుల్ని ఏమార్చుతూ మెస్సీ గోల్ కొట్టినట్టుగా మేం ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తాం: సీతారాం ఏచూరి
- బీజేపీ, తృణమూల్ మధ్యనే పోటీ అనేది అపోహ మాత్రమే
- కాషాయదళం, తృణమూల్ దుష్ప్రచారం చేస్తున్నాయి
- బెంగాల్ లో లెఫ్ట్ ఫ్రంట్ సత్తా చాటుతుంది
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పశ్చిమ బెంగాల్ పరిణామాలపై స్పందించారు. బెంగాల్ లో ప్రతి ఒక్కరూ బీజేపీ, తృణమూల్ మధ్యనే పోరాటం అని భావిస్తున్నారని, కానీ తాము ఫుట్ బాల్ స్టార్ లయొనెల్ మెస్సీ ప్రత్యర్థుల్ని ఏమార్చుతూ గోల్ కొట్టే విధంగా ఆశ్చర్యకర ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీ ఈసారి విస్మయకర ఫలితాలతో వస్తుందని తాను హామీ ఇవ్వగలనని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.
కాగా, సీఎం మమతా బెనర్జీ తమపై చేసిన ఆరోపణల పట్ల ఆయన బదులిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలవకూడదన్న ఉద్దేశంతో లెఫ్ట్ ఫ్రంట్ తన ఓట్లను బీజేపీకి బదలాయిస్తోందంటూ మమత ఆరోపించడం సరికాదని అన్నారు. సీపీఎం కార్యకర్తలు ఈ ఎన్నికల్లో బీజేపీకి సహకరించారని చెప్పడం పచ్చి అబద్ధం అని సీతారా ఏచూరి మండిపడ్డారు. రాష్ట్రంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న కాషాయదళం, తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమే ఇదంతా అని ఆరోపించారు. రాష్ట్రంలో పోటీ అంతా బీజేపీ, తృణమూల్ మధ్యే ఉందని ప్రజల్లో ఓ అపోహ సృష్టించారని, ఇది పూర్తిగా తప్పని అన్నారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎవరూ ఊహించని ఫలితాలతో నిజంగానే ఆశ్చర్యానికి గురిచేస్తుందని తెలిపారు.