Budha Venkanna: ఎన్నికల కమిషన్ కాదు.. బీజేపీ కమిషన్: బుద్ధా వెంకన్న
- తెల్ల కాగితంపై ఫిర్యాదు చేస్తే స్పందించింది
- దేశ చరిత్రలో తొలిసారి
- పీఎంవో ద్వారా ఈసీకి సిఫార్సు
భారతదేశంలో ఎన్నికల కమిషన్, బీజేపీ కమిషన్‌గా మారిపోయిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డి ఢిల్లీలో ప్రధాని కార్యాలయం నుంచి ఎన్నికల కమిషన్‌ను నడిపిస్తున్నారన్నారు. రీపోలింగ్ కోసం తాము రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిస్తే స్పందించలేదని కానీ విజయసాయి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెల్ల కాగితం మీద ఫిర్యాదు ఇస్తే ఎన్నికల సంఘం వెంటనే స్పందించిందన్నారు.
పోలింగ్ జరిగిన 40 రోజుల తర్వాత రీపోలింగ్ నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఓటమి భయంతోనే పీఎంవో ద్వారా వైసీపీ ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయించిందన్నారు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ద్వివేదిలు రీపోలింగ్‌కు ఆదేశించారన్నారు. కుట్రలతో, డబ్బుతో ఆ ఐదు కేంద్రాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం రీపోలింగ్ ప్రకటన చేయడం సిగ్గుచేటని, తాము కోరిన 19 చోట్ల కూడా రీపోలింగ్ నిర్వహించాలని అన్నారు.