CP: సివిల్స్ కు ఎంపిక కాకపోవడంతో ‘నకిలీ ఐపీఎస్’గా మారాడు: సీపీ అంజనీకుమార్
- నకిలీ ఐపీఎస్ గురువినోద్
- సివిల్స్ కు హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నాడు
- సివిల్స్ సాధించలేక పోవడంతో అడ్డదారి పట్టాడు
నకిలీ ఐపీఎస్ గా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతున్న గురువినోద్ కుమార్ రెడ్డిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, నిందితుడి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఐపీఎస్ కావాలన్న తన కల నెరవేరకపోవడంతో గురువినోద్ ‘నకిలీ ఐపీఎస్’గా మారాడని చెప్పారు.
2017లో హైదరాబాద్ లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్ లో గురువినోద్ శిక్షణ పొందాడని చెప్పారు. అయితే, సివిల్స్ కు ఎంపిక కాలేకపోవడంతో పక్కదారి పట్టాడని అన్నారు. ఓ తప్పుడు గుర్తింపు కార్డును సృష్టించి, నకిలీ ఐపీఎస్ గా చలామణి అవుతూ మోసాలకు పాల్పడినట్టు చెప్పారు. గురువినోద్ వివిధ కేసుల్లో జైలు పాలైనట్టు తెలిపారు. 2019లో జైలు నుంచి బయటకొచ్చిన అతనిలో ఎటువంటి మార్పు రాలేదని, మళ్లీ నేరాలకు పాల్పడటం మొదలు పెట్టాడని అన్నారు.
ఓ కోచింగ్ సెంటర్ లో సోషియాలజీ బోధిస్తున్న రిటైర్డ్ ఆర్మీ మేజర్ తో గురువినోద్ కు పరిచయం ఏర్పడినట్టు అంజనీకుమార్ చెప్పారు. ఆ రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఇంటి నుంచి తుపాకీ సహా కొన్ని వస్తువులు అపహరణకు గురయ్యాయి. దీంతో, గురువినోద్ పై ఆయనకు అనుమానం రావడంతో, ఎన్ఐఏ కు ఫిర్యాదు చేశారు. దీంతో, గురువినోద్ గురించిన అసలు విషయం బయటపడిందని అంజనీకుమార్ వివరించారు.